Friday, 3 September 2021

Abhiyum Anuvum Full Movie Explained in Telugu

 ఇది ద్విభాషా చిత్రం. మలయాళంలో Abhiyude Katha Anuvinteyum అన్న పేరుతో విడుదలైంది. తమిళంలో మలయాళ నటుడు టోవినో థామస్ కి మొదటి సినిమా !

కొన్ని కొన్ని సినిమాలు కథాపరంగా చాల సాదా సీదాగా మొదలవుతాయి. దాదాపు సగం సినిమా అయ్యేదాకా కూడా ఈ కథలో కొత్తదనం ఏముంది అనుకుంటాం. కాని ఇంటర్వల్ వచ్చేసరికి సడన్ గా కథ ట్విస్ట్ తీసుకునేసరికి మనం ఉలిక్కిపడి ఈ కథలో ఏదో కొత్తదనం ఉందని అలర్ట్ అవుతాము. ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరుగుతుంది.

Abhiyum Anuvum Explained in Telugu


అభి అని పిలవబడే అభిమన్యు చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంటాడు. ఊటీలో ఆర్గానిక్ కూరగాయలు పండించి అమ్మే అను అనే అమ్మాయి ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోని ఒక రోజు అభి చూస్తాడు. ఆ వీడియో అతనికి నచ్చి, ఆమె పోస్ట్ చేసిన ఇతర వీడియోలు కూడా చూస్తాడు. ఆమెలోని చలాకీతనం, సేవా కార్యక్రమాలు చూసి, ఆమె పట్ల అతను ఆకర్షితుడై ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాడు. కాని ఆమె రిజెక్ట్ చేస్తుంది. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి ఆమెతో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయించుకుంటాడు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకసారి అభి ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ ఐ లవ్ యూ అని తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఆమె ఏమీ అనకుండా ఫోన్ కట్ చేస్తుంది. అతను, తన ప్రేమను ఆమె రిజెక్ట్ చేసిందా అన్న అనుమానంతో ఊటీ వెళ్లి ఆమెని కలిసి అడుగుతాడు, ఫోన్ ఎందుకు కట్ చేసావని. అందుకామె నవ్వుతూ నువ్వు ప్రొపోజ్ చేసేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఎలావుంటుందో చూడాలని అని చెప్పి, అతని ప్రేమని అంగీకరిస్తుంది. కాని ఒక కండిషన్ పెడుతుంది, రేపే పెళ్లి చేసుకోవాలని. అతను ఒప్పుకుంటాడు. అనుకున్నట్టుగానే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే వారి పెళ్లి జరిగిపోతుంది.
ఆ తరువాత, వాళ్ళు చెన్నై లోని వాళ్ళ ఫ్లాట్ కి వస్తారు. అదే అపార్ట్మెంట్స్ లో వుండే, అభిని కొడుకులా అభిమానించే రేవతి వారికి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం చెబుతుంది. వారి పెళ్లి విషయం అభి తల్లిదండ్రులకు, అను తల్లి మీనాకు తెలిసి, వాళ్ళు కూడా సంతోషిస్తారు. కొన్ని నెలలు గడుస్తాయి. అను ప్రెగ్నెంట్ అవుతుంది. కూతురిని చూసుకోవడానికి మీనా వచ్చి వారితో పాటే ఉంటుంది. ఇంతవరకూ ఇది మామూలు ప్రేమ కథే ! ఇందులో స్పెషాలిటీ ఏముంది అనుకుంటాం! కాని, కథలో ఇక్కడే ట్విస్ట్ మొదలవుతుంది !
మీనా తన కూతురు అనును చూసుకోవడాని వచ్చి వారితోనే వుంటోందన్న విషయం చెప్పుకున్నాం కదా. అభి తల్లి కోడలిని చూసుకోవడానికి ఒక నడివయస్కురాలిని వారి వద్దకు పంపిస్తుంది. ఆమె వచ్చి మీనాని చూసి గుర్తు పట్టి, కంగారుతో అభి తలిదండ్రులకు ఫోన్ చేస్తుంది. వాళ్ళు అదరబాదరగా దొరికిన ఫ్లైట్ లో చెన్నై వచ్చి అభి ఇంటికి వస్తారు
ఇక్కడే మనకు ప్రశ్నల వర్షం మొదలవుతుంది. అసలు మీనాని చూసి ఆ మధ్యవయస్కురాలు ఎందుకు అంత కంగారు పడింది? అసలు మీనా ఎవరు? ఆమె పేరు చెప్పగానే అభి తలిదండ్రులు ఎందుకంత షాక్ అయ్యారు? ఈ ఉదంతం అభి, అనుల కాపురంలో ఏమైనా డిస్ట్రబెన్స్ కలిగిస్తుందా? ఈ ప్రశ్నలకు జవాబే మెయిన్ ట్విస్ట్ కాబట్టి వీటికి సమాధానం చెప్పనని మీకు తెలుసు కదా !
ఈ ట్విస్ట్ చాల సున్నితమైన అంశం. ఇలాంటి అంశాన్ని బ్యాలన్సుడ్ గా తెర మీదకు ఎక్కించడం అంత సులువు కాదు. దర్శకురాలు బి. ఆర్ . విజయ లక్ష్మి చాల విజయవంతంగా ఆ ప్రయత్నం చేసారు. అందుకు ఆమెను మనం అభినందించాలి. ఇంతకీ విజయ లక్ష్మి ఎవరో కాదు, ఒక నాటి ప్రఖ్యాత కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడు అయిన బి ఆర్ పంతులు కూతురు. స్వతహాగా ఆమె సినిమాటోగ్రాఫర్. దాదాపు 22 సినిమాలకు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే అభిగా టోవినో థామస్, అనుగా పియా బాజ్పాయి, రేవతి గా సుహాసిని, ఆమె భర్తగా ప్రభు, మీనాగా రోహిణి అద్భుతంగా నటించారు. పాటలు మెలోడియస్ గా వున్నాయి. నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేస్తాయి.
తప్పకుండ చూడాల్సిన సినిమా. అమెజాన్ ప్రైమ్ లో వుంది
చిత్ర పరిచయం: రాంకుమార్ భారతం

No comments:

Post a Comment

Abhiyum Anuvum Full Movie Explained in Telugu

  ఇది ద్విభాషా చిత్రం. మలయాళంలో Abhiyude Katha Anuvinteyum అన్న పేరుతో విడుదలైంది. తమిళంలో మలయాళ నటుడు టోవినో థామస్ కి మొదటి సినిమా ! కొన్ని...